Home  »  Featured Articles  »  ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ కృష్ణ‌కుమారి.. హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఇదే!

Updated : Mar 21, 2026

1949లో ‘మనదేశం’ చిత్రంతో సినిమా రంగంలో ప్రవేశించిన నటరత్న ఎన్.టి.రామారావు.. ‘పాతాళభైరవి’ చిత్రంతో మాస్ హీరోగా అవతరించారు. ఆ తర్వాత ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించి  వారి అభిమానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 35 సంవత్సరాల పాటు హీరోగా కొనసాగిన ఎన్టీఆర్.. తన కెరీర్‌లో 47 మంది హీరోయిన్లతో కలిసి నటించారు. అంతమంది హీరోయిన్లతో చేసినా ఆయన ఫేవరెట్ హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఆమె కృష్ణ‌కుమారి.

ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు జమున. వీరిద్దరి కాంబినేషన్‌లో 31 సినిమాలు వచ్చాయి. ఆమె తర్వాత సావిత్రి 26, అంజలీదేవి 26 సినిమాల్లో నటించారు. 25 సినిమా లతో ఆ తర్వాతి స్థానంలో కృష్ణ‌కుమారి ఉన్నారు. ఎన్టీఆర్, కృష్ణ‌కుమారి కలిసి నటించిన మొదటి సినిమా పిచ్చిపుల్లయ్య. అలాగే చివరి చిత్రం వరకట్నం. అయితే ఈ రెండూ ఎన్టీఆర్ సొంత బేనర్‌లో నిర్మించిన సినిమాలు కావడం విశేషం. 

1960వ దశకంలో ఎన్టీఆర్, కృష్ణ‌కుమారి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ వచ్చింది. వీరిద్దరూ  కలిసి చేసిన చాలా సినిమాలు సూపర్‌హిట్ అయి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మిగతా హీరోయిన్లతో కలిసి లెక్కకు మించిన సినిమాలు చేసినా ఎన్టీఆర్, కృష్ణ‌కుమారి విషయంలో మాత్రం రకరకాల ప్రచారాలు జరిగాయి. ఎన్టీఆర్, కృష్ణ‌కుమారి మధ్య ఏదో ఉందని పరిశ్రమలో గుసగుసలు మొదలయ్యాయి. ఆరోజుల్లో సినిమా తారలకు సంబంధించిన గాసిప్స్ ఎక్కువ ప్రచురించేది ‘కాగడా’ పత్రిక. ఎన్టీఆర్, కృష్ణ‌కుమారి పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ పత్రికలో ప్రచురించారు కూడా. 

పరిశ్రమలో జోరుగా సాగుతున్న ఈ ప్రచారం కృష్ణ‌కుమారి దష్టికి వచ్చింది. అప్పటికి ఎన్టీఆర్‌తో మరో నాలుగు సినిమాలు కమిట్ అయి ఉన్నారామె. అవికాక మరికొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్‌గా బుక్ అయ్యారు. అవన్నీ పక్కన పెట్టేసి వ్యాపార వేత్త అజయ్ ఖేతాన్‌ను పెళ్లి చేసేసుకున్నారు. హడావిడిగా ఈ పెళ్లి జరగడంతో సొంత అక్క అయిన షావుకారు జానకి కూడా పెళ్లికి హాజరు కాలేకపోయారు. పెళ్లి అయ్యేనాటికి కృష్ణ‌కుమారి వయసు 36 ఏళ్లు. అప్పటికీ ఆమె టాప్ హీరోయిన్‌గానే ఉన్నారు. సడన్‌గా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం కృష్ణ‌కుమారి ఎందుకు తీసుకున్నారనేది ఎవరికీ అర్థం కాలేదు. తనకు, ఎన్టీఆర్‌కు మధ్య ఏదో ఉందనే ప్రచారం వల్లే హడావిడిగా పెళ్లి చేసుకున్నారని పత్రికలు, ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. 

పెళ్లి నాటికి కమిట్ అయిన సినిమాలను పక్కన పెట్టి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు కృష్ణ‌కుమారి. దాదాపు రెండేళ్ళ తర్వాత నిర్మాత ఎ.వి.సుబ్బారావు బలవంతం మీద అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన భార్యాబిడ్డలు చిత్రంలో నటించారు. సినిమాల్లో కొనసాగేందుకు భర్త అజయ్ ఖేతాన్, అత్తగారు ప్రోత్సహించారు. అలా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. 1982లో విడుదలైన బంగారు భూమి చిత్రంతో నటనకు ఫుల్‌స్టాప్ పెట్టారు కృష్ణ‌కుమారి. దాదాపు 20 సంవత్సరాల తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఫూల్స్ చిత్రంలో నటించారు. అదే కృష్ణ‌కుమారి నటించిన చివరి సినిమా.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.